ఆకతాయిల ఆగడాలు అరికట్టాలి

TEJA NEWS

ఆకతాయిల ఆగడాలు అరికట్టాలి
** డయల్ యువర్ కమిషనర్ లో ఫిర్యాదు

తిరుపతి: నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన “డయల్ యువర్ కమిషనర్” కు పలువురు ప్రజలు ఫోన్ చేసి ఆకతాయిల ఆగడాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అయ్యే తరుణంలో ప్రతి ఏరియాలోనూ విధిగా పోలీసులు ముమ్మర గస్తీలు తిరిగేలా చర్యలు ఉండాలని కోరారు. బైరాగిపట్టెడ, అమరావతి నగర్, వెస్ట్ చర్చి ఏరియా, పెద్దకాపు లే అవుట్, జీవకోన, సత్యనారాయణపురం, మధురానగర్, సప్తగిరి నగర్, ఇస్కాన్ రోడ్డు, టీటీడీ క్వార్టర్స్ ఏరియాల ప్రాంతాల్లో యువకులు వీధుల్లో అడ్డంగా తిరుగుతూ వెకిలి చేష్టలతో బాలికలకు ఇబ్బందులు పెడుతున్నారు.

స్పందన కార్యక్రమానికి 23 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలు తెలుపగా, 19 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. బక్రీద్ కు ఈద్గా మైదానంలో ఏర్పాట్లు చేయాలని కార్పొరేటర్ ఎస్.కె .బాబు కోరారు. కాగా ఎస్.ఎల్.వి.నగర్ నందు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, 6,7 వార్డుల్లో మెప్మా సంఘాలు జరిపేందుకు గదులు కేటాయించాలని, కె.బి.లే ఔట్ నందు ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని, యుడిఎస్ ఓవర్ ఫ్లో అరికట్టాలని, టిడిఆర్ ఇప్పించాలని, ఎమ్మార్ పల్లి 80 అడుగుల రోడ్డులో రోడ్డుపై వ్యాపారాలు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వాహనాలు ఆపుతున్నారని, ఉప్పంగి హరిజనవాడలో ఆక్రమణలు అరికట్టాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ డి.ఈ.లు, ఏసిపి లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top