ఆటోనగర్ లో కమిషనర్ ఆకస్మిక పర్యటన
తిరుపతి: రేణిగుంటకు వెళ్లే మార్గంలోని ఆటోనగర్ లో తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య ఆకస్మిక పర్యటన చేపట్టారు. . వాహనాలు మరమ్మత్తులు చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ దుకాణదారులను ఆదేశించారు. ఆటోనగర్ లోని వాహనాలు మరమ్మతులు నిర్వహించే ప్రాంతాలను నగరపాలక సంస్థ, ఐలా అధికారులతో కమిషనర్ పరిశీలించారు. పలు చోట్ల ఎక్కడపడితే అక్కడ టైర్లు, వాహనాల విడి భాగాలు పడేసి అపరిశుభ్రంగా ఉండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన ప్రాంతం అయిన ఆటో నగర్ అపరిశుభ్రంగా ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎక్కడపడితే అక్కడ చెత్త వేసినా, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణదారులకు అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. చెత్త కాల్చడం వంటివి చేయకుండా చూడాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని అన్నారు. స్థానికులు, దుకాణదారుల కోరిక మేరకు డ్రైనేజీ కాలువలు నిర్మాణం, రోడ్ల ఏర్పాటుకు పరిశీలన చేస్తామని అన్నారు. కమిషనర్ వెంట ఐలా కమిషనర్ రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, డి.ఈ.లు రమణ, శిల్ప తదితరులు ఉన్నారు.
