26 నుంచి పెరియాళ్వార్ ఉత్సవం
తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో ఈనెల 26 నుంచి జూలై 5వ తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్న జీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదిస్తారు. చివరి రోజైన జూలై 05వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్కు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీగోవిందరాజ స్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వార్ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్ అమ్మవారు చివరకు స్వామివారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్ ఎన్నో పాశురాలను రచించి స్వామివారికి అర్పించారు. ఈయనకు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.
