ఎస్వీ యూనివర్సిటీని సందర్శించిన యూకే డిప్యూటీ హైకమిషనర్
తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం సందర్శించారు. యుకె, ఆంధ్రప్రదేశ్ మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యం అన్నారు. అందులో భాగంగా విద్య, సాంకేతికత, ఆర్థిక అభివృద్ధి రంగాలను పరిశీలిస్తామన్నారు. తన పర్యటన సందర్భంగా ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, ప్రిన్సిపాల్స్, డీన్స్ యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హైకమిషనర్ కు స్వాగతం పలికారు. విద్యావృద్ధి ఆవిష్కరణల ప్రయోజనం చేకూర్చడానికి, కృత్రిమ మేధస్సు, జీవ శాస్త్రాలతో సహా వివిధ రంగాలలో యు.కె.యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంలో డిప్యూటీ హై కమిషనర్ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్థలు, పరిశ్రమలతో బలమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి యు.కె.అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ డైనమిక్ విద్యా దృశ్యాన్ని, అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో సహకారానికి అపారమైన అవకాశాలను ఆయన చర్చించారు. పరస్పర ప్రయోజనకరమైన ఫలితాలను ఇచ్చే రెండు ప్రాంతాల ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడే ఉమ్మడి పరిశోధన, విద్యా మార్పిడి, వాణిజ్య వెంచర్ల కోసం స్పష్టమైన మార్గాలను అన్వేషించడం తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ రాయల, లక్ష్మీ పడిలేటి, శ్రీనివాస్, పూర్వ అధ్యక్షులు, నీఇలిట్ తిరుపతి డైరెక్టర్ శశి కుమార్ పాల్గొన్నారు.
