ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలి.

TEJA NEWS

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలి…

వివిధ ప్రభుత్వ పథకాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి….

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

పెద్దపల్లి, .ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

బుధవారం రంగపూర్ లోని రాధాకృష్ణ ఏసీ కన్వెన్షన్ హాల్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశము పై స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జూన్ 12 వరకు జరిగే 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ, క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించే దిశగా కృషి చేయాలని , ప్రజాప్రతినిధులు అధికారుల తో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు.మార్చి 15 లోపు వివిధ శాఖలలో చాలా కాలంగా పెండింగ్ ఉన్న ఫైల్స్ పరిష్కారం కోసం చర్యలు చేపట్టామన్నారు.

జిల్లాలో దాదాపు 6 లక్షల 80 వేల జనాభాకు రేషన్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుందని, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ కొనసాగిస్తున్నామని, మీ -సేవా ద్వారా దరఖాస్తు చేసుకుంటే విచారించి రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి శాఖ సంబంధించి పని తీరు ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమంలో తెలుస్తుందని, ప్రజా ప్రతినిధులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ఇండ్ల పై సోలార్ ప్యానల్స్ ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ప్రజా ప్రతినిధులు దీనిపై అవగాహన పెంచుకొని గ్రామ, పట్టణ స్థాయిలో దీనిని అమలు చేసేందుకు ప్రజలు ముందుకు వచ్చేలా ప్రచారం చేయాలని ఆయన కోరారు.

ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం తగ్గుతుందని, మోతాదుకు మించి ఎరువులు వాడకుండా తగ్గించేందుకు, ఎరువుల సరఫరా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం యూరియా సరఫరా కోసం యాప్ ప్రవేశ పెట్టిందని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు అవసరాలను మనం గుర్తించి దాని దిశగా కృషి చేయాలన్నారు.

ప్రతి ఎకరం ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ప్రభుత్వం 4 సంవత్సరాల వ్యవధిలో దాదాపు ఎకరానికి 52 వేల రూపాయల సబ్సిడీ అందిస్తుందని, అంతర్ పంటలతో కూడా రైతులకు ఆదాయం వస్తుందని, తిరుమల ఆయిల్ పామ్ కంపెనీ జిల్లాలో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.

రాబోయే రబీ సీజన్ లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా తో ఏర్పాట్లు చేస్తున్నామని, తేమ శాతం, నాణ్యతతో కూడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే ఆ రోజే కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. ప్యాక్స్ ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, గోదాములు నిర్మిస్తున్నామని తెలిపారు.

సుల్తానాబాద్ లో ఖేలో ఇండియా సెంటర్ నడుస్తుందని, జాతీయ అంతర్జాతీయ క్రీడ పోటీలలో ఎంపికై పాల్గొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రీడాకారులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

గ్రామాలలో ఎక్కడైనా అసైన్డ్ భూములలో విద్యుత్ మోటారు,కనెక్షన్ లేని ఎస్సి ఎస్టీ రైతులు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే వివిధ పథకాల క్రింద మంజూరు చేయగలుగుతామన్నారు. ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలు ఈ సేవలు మెరుగ్గా వినియోగించుకునేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.

14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సినేషన్ వేయడం వల్ల గర్భాశయం ద్వారా వచ్చే క్యాన్సర్ నివారించవచ్చని, బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించి టీకా వేయించుకునేలా చూడాలని కలెక్టర్ కోరారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్పెషలిస్ట్ డాక్టర్లను షెడ్యూల్ ప్రకారం పంపి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

అడ్వాన్స్డ్ ట్రేడ్ సెంటర్ లలో ఆధునిక కోర్సులు ప్రవేశ పెట్టి విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వెంటనే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని , టాటా సంస్థ వారి సహకారంతో ఈ సెంటర్లో నిర్వహిస్తున్నామని, మంథనిలో మరో ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కెరియర్ ఆప్షన్ క్రింద మన యువత ఏ.టీ.సీ సెంటర్లను సందర్శించేలా చూడాలన్నారు.

అనంతరం టీజి ఐపాస్, టీ-ప్రైడ్, టీ- ఐడియా, పీఎం ఉపాధి కల్పన పథకం, డీఈఈటీ వంటి వివిధ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top