ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం

TEJA NEWS

ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం

** ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల క‌ల్యాణం

** టీటీడీ జేఈవో వీరబ్రహ్మం

తిరుపతి / ఒంటిమిట్ట: అన్నమయ్య జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ‌ రామ‌స్వామివారి ఆల‌యంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగిరం కావాలని టీటీడీ జేఈఓ వీర‌బ్ర‌హ్మం అధికారుల‌ను ఆదేశించారు.
ఏప్రిల్ 1న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని, ఇప్ప‌టివ‌ర‌కు చేప‌ట్టిన బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల ప‌నులు, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, భ‌విష్య‌త్తులో చేప‌ట్టాల్సిన ప‌నుల‌ను ప‌రిశీలించి, అన్ని విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. అలాగే అధికారుల‌తో క‌లిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ‌ ఉంచే షెడ్లను పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

భక్తులకు అన్నప్రదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబులు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలో, యాగశాలలో మరమ్మతు పనులు త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. టిటిడి స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు. అనంత‌రం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్న‌ప్ర‌సాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదం వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని సూచించారు. కళ్యాణ వేదిక వద్ద విఐపిలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలన్నారు.

కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఔషద
మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా నిరంతరాయంగా శ్రీరామనామం ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజులపాటు ప్రచార ర‌థాల‌ ద్వారా పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, బ్ర‌హ్మోత్స‌వాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు.
స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top