
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి:
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు, అధికారులకు, ఆహ్వానితులందరికీ ఆహ్వానాలు, అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకలకు వేదిక ఏర్పాట్లు సహా హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు పకడ్బందీగా కల్పించాలన్నారు. పోలీసు గౌరవ వందనంతో పాటు, బందోబస్తు కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. వేడుకల ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వివిధ శాఖల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జెడ్పి సీఈవో యాదయ్య, సిపిఓ హరికృష్ణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.