
నిబద్ధతకు గుర్తింపుగా బచ్చ ప్రవీణ్ కుమార్‌కు ఘన సన్మానం…
“39 ఏళ్ల నిష్కళంక సేవలకు ఘన నివాళి.. సింగరేణి ఉద్యోగి బచ్చ ప్రవీణ్ కుమార్‌కు ఆత్మీయ వీడ్కోలు”…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలో 39 సంవత్సరాలపాటు సుదీర్ఘకాలం సేవలందించి ఆర్జీ-3 ఓసియం-1లో ఈపీ ఫిట్టర్‌గా ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్‌ను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సహోద్యోగులు ఘనంగా సన్మానించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
ఓసియం-1 బేస్ వర్క్‌షాప్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రవీణ్ కుమార్, ప్రభావతి దంపతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు బచ్చ ప్రవీణ్ కుమార్ క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఉద్యోగ జీవితమంతా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ అందరి మన్ననలు పొందారని తెలిపారు.
అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగిని సంస్థ కోల్పోవడం బాధాకరమే అయినప్పటికీ ఉద్యోగ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించి షటిల్ రాకెట్‌ను జ్ఞాపికగా బహుకరించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు శంకర్, పాపయ్య, సుధాకర్ రెడ్డి, కాశీ విశ్వేశ్వర్ రావు, నసీర్ అహ్మద్, రఘు కుమార్, సత్యనారాయణ, సాయి స్వరూప్, కార్మిక సంఘాల నాయకులు నక్క రమేష్, సదానందం, క్రీడాకారులు హరికిషన్, ముకేశ్ కుమార్, చంద్రపాల్, శేషగిరి, అల్లం రమేష్, కేఎల్‌ఎన్ ప్రసాద్, గంధం శ్రీనివాస్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివ, బుగ్గాజి, జక్కుల దామోదర్, పూర్ణాకర్, వాసు, రవి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.