కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘ఆరైవ్ ఆలైవ్’ అవగాహన కార్యక్రమం
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కూకట్పల్లి ఐడీఎల్ / రంగదాముని చెరువు వద్ద కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ‘ఆరైవ్ ఆలైవ్’ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవన విధానంలో మార్పులు, సరైన నిద్ర లేకపోవడం, తొందరగా వెళ్లాలనే ఆలోచనల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మానవ ప్రాణం ఎంతో అమూల్యమైనదని, దానిని కాపాడుకోవడం అలాగే తమపై ఆధారపడి ఉన్న కుటుంబాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.
“స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని సురక్షితంగా ప్రయాణం సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలు నడుపుతూ హెల్మెట్ ధరించని వారికి బసంతి ఫౌండేషన్ ద్వారా హెల్మెట్లు పంపిణీ చేయగా, ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులను సీపీ అభినందించారు.
హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందనే అపోహతో కొందరు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారని, అయితే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రాణాలకే తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు, యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ తరహా అవగాహన కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోన్ డీసీపీ రీతి రాజ్ మేడం, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రత్నకుమార్ సర్, అదనపు డీసీపీ (ట్రాఫిక్) సర్, బాలానగర్ ఏసీపీ సర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ (మూసాపేట) , మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, ఆర్టీసీ డిపో మేనేజర్, అలాగే పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
