బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి…

TEJA NEWS

బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి….

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరిక…..

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం పోలీస్ కమిషనరేట్ బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ పశువుల రవాణా నియంత్రణ, ప్రభుత్వ నిబంధనల అమలుపై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఖురేషి (స్లాటర్ హౌస్ నిర్వాహకులు)లతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. పశువుల కొనుగోలు, రవాణా, వధ ప్రక్రియల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

రవాణా సమయంలో జంతువులకు సరైన సంరక్షణ కల్పిస్తూ మానవత్వంతో వ్యవహరించాలని, వాహనాల్లో అధిక సంఖ్యలో పశువులను ఎక్కించరాదని సూచించారు. తనిఖీల సమయంలో పోలీస్, వెటర్నరీ, రవాణా శాఖ అధికారులకు పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నకిలీ లేదా చెల్లని వెటర్నరీ సర్టిఫికెట్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనుమతి లేని ప్రదేశాల్లో జంతువుల వధ, బహిరంగ ప్రదేశాల్లో మాంసం విక్రయాలు, ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలు చట్టరీత్యా నేరమని సీపీ స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు, వీడియోలు, ఫోటోలు షేర్ చేయరాదని సూచించారు.

అక్రమంగా పశువుల రవాణా, నిషేధిత జంతువుల వధ, అనుమతులు లేకుండా స్లాటర్ హౌస్ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెక్‌పోస్టులు, అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

పండుగ సమయంలో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సామరస్య వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలని ఖురేషి నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించడంతో పాటు వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలను ఉపేక్షించబోమని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.

ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కే. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, బెల్లంపల్లి రూరల్ ఇన్‌స్పెక్టర్ హనూక్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు భీమేష్, శ్రీనివాస్, ఎస్‌ఐలు, స్లాటర్ హౌస్ నిర్వాహకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top