కోర్టుల ముందూ బలనిరూపనా…?
** ప్రజాస్వామ్య వ్యవస్థలంటే విలువల్లేని జగన్
** జగన్ రెడ్డి తీరును తప్పు బట్టిన టీడీపీ నేతలు
చిత్తూరు: న్యాయస్థానాల పై గౌరవం లేని ఘనుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. చట్టాలలోని లొసుగులను తనకు అనుకూలంగా మలచుకుని తనపై ఉన్న కేసులను సాగ తీయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. శుక్రవారం చిత్తూరులోని తన కార్యాలయంలో సురేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. కోర్టుల ముందు కూడా బలనిరూపణ చేసి ప్రజాస్వామ్య విలువలను దిగజార్చిన మహా మేధావి జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తానేమైనా ఉద్యమ కేసుల్లో కోర్టుకు వెళ్లాడా..? సిగ్గులేని అవినీతి, అక్రమ సంపాదన కేసుల్లో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎవ్వరైనా ఇతరుల కంటపడకుండా తల దించుకుని వెళ్తారని… అయితే జగన్ వ్యవహార శైలి చూస్తే తప్పు చేసామనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా నిస్సిగ్గుగా బల నిరూపణ కోసం కోట్లు ఖర్చుచేసి జనాన్ని, నిరుద్యోగ యువతను పోగుబెట్టి కోర్టుకు రావడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని పేర్కొన్నారు. అక్రమాస్థులు కూడబెట్టిన కేసుల్లో జగన్ శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు.
గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారత దేశంలో.., మాజీ ప్రధాని స్వర్గీయ నరసింహా రావు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన జయలలిత, అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ పొలిటీషియన్ లాలు ప్రసాద్ యాదవ్ వంటి వారు న్యాయస్థానాలను గౌరవించి, చట్టాలకు లోబడి సాధారణ వ్యక్తులుగా కోర్టులకు హాజరైతే… అందుకు భిన్నంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ.., మంది మార్బలంతో న్యాయస్థానానికి చేరుకుని బలనిరూపణ చేయడం జగన్ రెడ్డి అహంబావానికి అద్దం పడుతోందన్నారు. అంతేకాకుండా న్యాయస్థానాల పై ఆయనకు గౌరవం లేదని స్పష్టమైందని చెప్పారు. ఇటువంటి వారిని కోర్టులు ప్రత్యేకంగా పరిగణించి, చట్ట పరమైన చర్యలు తీసుకోనేందుకు వెనకాడకూదని విజ్ఞప్తి చేశారు. అప్పుడే రాజ్యాంగానికి లోబడి పని చేసినట్లవుతుందని విన్నవించారు. ముఖ్యంగా ‘పెయిడ్ ఆర్టిస్టుల’ను ఉపయోగించి కోర్టులను మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం చెల్లదని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధి, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా, విచారణలో భాగంగా న్యాయస్థానాలకు హాజరయ్యే సమయంలో వినయంగా వ్యవహరించాలి అనే ప్రాథమిక నియమాన్ని జగన్ విస్మరిస్తున్నారని సురేంద్ర కుమార్ విమర్శించారు. తనపై ఉన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహం న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.
జగన్ రెడ్డి కోర్టుకు హాజరైన ప్రతిసారి ప్రజల నుంచి లేదా ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయనే భయాన్ని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌లో నానా హంగామా చేశారని ఆరోపించారు. కోర్టు విచారణలో సహకరించకుండా, ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టించడం ద్వారా వ్యక్తిగత ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సాధారణంగా, చట్టపరమైన చిక్కుల్లో ఉన్న వ్యక్తి కోర్టుల పట్ల గౌరవంతో… పశ్చాత్తాపంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే, జగన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని, బదులుగా తన తప్పును సమర్థించుకునే ధోరణి మాత్రమే కనిపిస్తోందని సురేంద్ర కుమార్ గట్టిగా వ్యాఖ్యానించారు.
అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టంగా పేర్కొన్నారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, అధికారం మారినంత మాత్రాన గతంలో చేసిన తప్పులకు శిక్ష తప్పదని నొక్కి చెప్పారు. కోర్టుల పనితీరు, న్యాయ ప్రక్రియల పట్ల ప్రజలకున్న గౌరవాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించడం కేవలం కాలయాపన మాత్రమే అవుతుందని ఆయన హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు జగన్ నిజాయితీగా, హుందాగా , వినయం గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సురేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.
