భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మాట్లాడిన ముఖ్యాంశాలు:-
ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల సమస్యలను ప్రజల మధ్య చర్చకు తీసుకురావాలి. ప్రజల మద్దతును సమీకరించి, ప్రజలకు మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి, అవసరమైతే పోరాటాలకు శ్రీకారం చుట్టాలి. కానీ ఈరోజు కేటీఆర్ గారి రాజకీయ విధానం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
కేటీఆర్ గారు ప్రజాక్షేత్రాన్ని వదిలేసి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయికి రావాలని స్వయంగా వారి కుటుంబ సభ్యురాలైన కవిత గారే చెప్పిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అయినా కేటీఆర్ లో ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
నేను బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే, కేటీఆర్ గారు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంగా ఆఘమేఘాలపై రాష్ట్రస్థాయి భారీ సభ పెట్టారు. అయినప్పటికీ ఆ రోజు ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది పూర్తిగా తన బలాన్ని నిరూపించుకునే బలప్రదర్శన సభగా మాత్రమే మిగిలిపోయింది.
ఆ సభకు వచ్చిన వారిలో చాలామంది యువతీ యువకులు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన నా సోదర సోదరిమణులే. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి కేటీఆర్ గారు గానీ, కేసీఆర్ గారు గానీ ఒక్కరోజు కూడా క్షేత్రంలో ప్రచారం చేయలేదు. ఎలాంటి సహాయం, సహకారం అందించలేదు. ఇది బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూపిస్తుంది.
దీనికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చింది. ఒకసారి పార్టీ మారిన తర్వాత కట్టుబాటుతో, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే గౌరవాన్ని బీజేపీ అందిస్తుంది.
అందుకే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ విధానంతో కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగుతోంది. 20కు పైగా రాష్ట్రాలలో ప్రజల ఆశీర్వాదాలతో బీజేపీ అధికారంలో ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో పార్టీ గుర్తు లేకపోయినా, నేను పార్టీ మారేటప్పుడు ఎవరినీ నాతో రావాలని ఒత్తిడి చేయలేదు. కొందరికి బాధ, కొందరికి వెలితి ఉండటం సహజం.
ప్రజల బాధ్యతతోనే నేను క్షేత్రస్థాయిలో ప్రచారం చేశాను. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అరాచకం, అల్లర్లు, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది.
అమ్రాబాద్ మండలం డీకే తిరుమలాపూర్ గ్రామంలో పరిస్థితి అత్యంత దురదృష్టకరంగా మారింది. అక్కడ బీజేపీకి చెందిన ఒక యువ కార్యకర్త తల్లి వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తే, ఆమెను గెలిపించుకోవడానికి ఒక్కరే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అదే సమయంలో చెంచు ఆదివాసి యువకుడు ఈదయ్య బరిలో నిలబడ్డాడు. అతన్ని భయభ్రాంతులకు గురి చేసి పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరిగాయి. అయినా ధైర్యంగా నిలబడ్డ ఈదయ్యను గెలిపించడమే నా లక్ష్యంగా పనిచేశాను.
ఆ ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అక్కడే గందరగోళం సృష్టించారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక బీఆర్ఎస్ కార్యకర్త వచ్చి నా మెడలో బీఆర్ఎస్ కండువ వేయడం జరిగింది. అది నన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో జరిగిన చర్య. వెంటనే నేను ఆ కండువను తీసివేశాను. ప్రజలకు ఎలాంటి తప్పు సంకేతం వెళ్లకూడదనే ఉద్దేశంతో, నేను పార్టీలకు సంబంధించిన ఎలాంటి కండువాలనూ, గుర్తులనూ ధరించలేదు.
పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో నినాదాలు ఇద్దాం, ఇప్పుడు లక్ష్యం ప్రజల అభ్యర్థిని గెలిపించడం మాత్రమేనని వారికి నచ్చజెప్పాను. ఆ విధంగా అందరి అభ్యర్థిగా ఈదయ్యను గెలిపించడం జరిగింది.
నేను ఒక్క గ్రామానికే పరిమితం కాలేదు. నన్ను ఎక్కడికి పిలిచినా వెళ్లాను. భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేని ప్రతి చోటా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అభ్యర్థుల కోసం ప్రచారం చేశాను.
కేటీఆర్ గారు బీజేపీకి రెండు స్థానాలే వచ్చాయని వెటకారంగా మాట్లాడుతున్నారు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది స్థానాలు ఎలా వచ్చాయో ఆయన గుర్తుంచుకోవాలి. అది ప్రజల తీర్పు. అది ఎడ్డిమారి గుడ్డి దెబ్బ కాదు – ప్రజల స్పష్టమైన మద్దతు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేసినా, పాలమూరు వంటి ప్రాంతాల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. బల్మూరు వంటి ప్రాంతాలు ఎప్పటికీ బీజేపీకి కంచుకోటలే. గతంలోనూ, ఇప్పుడూ అక్కడ బీజేపీ అభ్యర్థులే గెలిచారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల రాజకీయాల శకం ముగిసింది. ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడే నాయకత్వమే ఇప్పుడు అవసరం. కృష్ణా–గోదావరి జలాలపై చర్చ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేసే విధంగా జరిగే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. అలాగే బీఆర్ఎస్‌కు కూడా మాట్లాడే నైతిక హక్కు లేదు.
నేను ఒక పాలమూరు వలస కూలీ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత ఆత్మపరిశీలన చేసుకొని, దేశానికి కావాల్సిన నాయకత్వం నరేంద్ర మోదీ గారిదే అని నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరాను. అప్పటి నుంచి నేటి వరకు పార్టీని బలపరచడం కోసం నిరంతరం పనిచేస్తున్నాను.
కేటీఆర్ గారు గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రయాణం రెండు స్థానాలతోనే మొదలైంది. అదే పార్టీ మూడోసారి దేశాన్ని పాలిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వెకిలి వ్యాఖ్యలు, సోషల్ మీడియా కామెంట్లు, డబ్బు ర్యాలీలతో ప్రజలను మభ్యపెట్టలేవు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా, భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే ప్రజల మధ్య నిలబడింది, నిలబడుతుంది. ఎంత కుట్రలు చేసినా కాషాయ జెండా మళ్లీ ప్రజాక్షేత్రంలో ఎగరడం ఖాయం.
