పిఆర్ఎస్ఐ వారిచే బడ్జెట్‌పై అవగాహన
** ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చిందన్న ఛార్టెడ్ అకౌంటెంట్
తిరుపతి: దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారాభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో పలు ప్రోత్సాహక చర్యలు చేపట్టారని ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ వి.భాగ్యతేజ తెలియజేశారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పిఆర్ఎస్ఐ) తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో తిరుపతి న్యూబాలాజి కాలనీలోని గ్రీన్ హోమ్ డెవలపర్స్ కార్యాలయంలో బడ్జెట్ -2026 పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్యతేజ కీలకోపన్యాసం చేస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ)ను ప్రోత్సహించేందుకు రూ. 10 వేల కోట్లతో గ్రోత్ ఫండ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. కార్పొరేట్ మిత్ర పేరుతో వృత్తి నిపుణులను తయారు చేసేందుకు ప్రభుత్వం పలు సంస్థలను ఏర్పాటు చేయనుందని వివరించారు. ఎంఎస్ఎంఇలకు ఆర్థికపరమైన మద్దతు ఇచ్చేందుకు ట్రేడ్ రిసీవబుల్స్ ఎలక్ట్రానిక్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా చర్యలు చేపట్టారని చెప్పారు. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పన్ను పరిధిలోకి వస్తారని సూచించారు.
ఉద్యోగులు వారి ఆదాయం కంటే తక్కువ మొత్తంలోనే క్రెడిట్ కార్డులను వినియోగించాలన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఏడాదికి అద్దెల ద్వారా రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తే టిడిఎస్ మినహాయింపు ఇచ్చినట్లు తెలియజేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ప్యాకేజీలకు పన్ను తగ్గించినట్లు చెప్పారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రంగాల్లోని ఉద్యోగులు, చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారవేత్తలకు వర్తించే పన్నులు, పన్ను మినహాయింపునకు ఉన్న మార్గాలను, బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను తెలియజేశారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎస్వీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ జి.అంజన్ బాబు మాట్లాడుతూ డిజిటల్ సార్వభౌమాధికారం ద్వారా చిప్ ల తయారీ, ఇతర సాఫ్ట్వేర్లు తదితరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే వాటిని ఉత్పత్తి చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు.
వరదలు, తుఫాన్లు లాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు పునరావాస చర్యలు, పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు భారత్ విస్తార్, అగ్రిటెక్ లాంటి అప్లికేషన్లను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అంశాల్లో సొంతంగా కంటెంట్ తయారు చేసేలా శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. గౌరవ అతిథి, ఎస్వీ యూనివర్సిటీ కామర్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.జయచంద్రారెడ్డి ఆన్లైన్ లో సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం బడ్జెట్లో పలు కేటాయింపులు చేశారని తెలిపారు. పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ ఛైర్మన్ డా.జిఎస్.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ దుద్యాల చంద్రమోహన్, జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.శ్రీనివాసరావు, కోశాధికారి కె.మధుసూదన్, జాయింట్ సెక్రటరీ సంస్కార్ రాజేష్, కార్యవర్గ సభ్యులు డా. సి.స్వరాజ్యలక్ష్మి, ప్రముఖ రచయిత ఆర్సీకె రాజు, వివి.సుబ్రహ్మణ్యం, సభ్యులు రవీంద్ర, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
