ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ​శుభ్రమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించాలి

TEJA NEWS

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ​శుభ్రమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించాలి

కిచెన్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టి, పరిశుభ్రత పాటించాలి

​ బుద్ధారం గురుకుల పాఠశాలలో కలెక్టర్ తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 69 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ

వనపర్తి :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, అందులో భాగంగానే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల వంటగది (కిచెన్) మరియు మెస్‌ను పరిశీలించారు. కిచెన్, మెస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆహార సామాగ్రి నిల్వ రిజిస్టర్లను పరిశీలించి, మెస్ కమిటీ విద్యార్థులు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా అనే అంశంపై విచారణ చేశారు.
అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న సదుపాయాలు, హాస్టల్ సమస్యలు తదితర అంశాలపై విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే ఆహారాన్ని సూపర్వైజర్ ముందుగా రుచి చూసి, అనంతరం విద్యార్థులకు అందించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు.

విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో కంటి పరీక్ష శిబిరాల ద్వారా మొత్తం 6950 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, 570 మందికి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించగా, ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థుల్లో 69 మందికి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ విద్యార్థులకు స్వచ్చంద సంస్థలు అయిన OP Tibre wala Foundation, హైదరాబాద్ టైటాన్స్ రౌండ్ టేబుల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచితంగా కొత్త కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థ ప్రతినిధులు నితిన్, అభిషేక్, అఖిల్ పాల్గొన్నారు.

ఉచితంగా కళ్లద్దాలు అందించిన స్వచ్చంద సంస్థ ప్రతినిధులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు కళ్లద్దాలను సరిగ్గా ఉపయోగించుకొని, విద్యలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలల్లో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను నిబద్ధతతో సాధించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, డి వై ఎస్ ఓ సుధీర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top