
ఆత్మకూరులో గంజాయి గ్యాంగ్ అరెస్ట్ – నలుగురు నిందితులు అదుపులో
3 లక్షల విలువ గల 5 కేజీల గంజాయి స్వాధీనం… కారు, బైక్, సెల్ ఫోన్లు సీజ్
సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నమ్మదగిన సమాచారం మేరకు ఆత్మకూరు గ్రామ శివారులోని క్రషర్ మిల్లు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టైన నిందితులు నిమికల్‌కు చెందిన విరబోయిన భరత్, జాజిరెడ్డిగూడెం కొమ్మాల గ్రామానికి చెందిన అరే విజయ్, సూర్యాపేట రూరల్ ఆరెగూడెం గ్రామానికి చెందిన చెవుల మనోజ్, నిమికల్ గ్రామానికి చెందిన కొడిదల శివగా గుర్తించారు.
వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ గల 5 కిలోల గంజాయి, ఒక కారు, ఒక బైక్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా గంజాయి కొనుగోలు చేసి విక్రయానికి సిద్ధమయ్యారని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం ముగ్గురు నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు ప్రాంతానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తెచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం గంజాయిని పంచుకోవడానికి ఆత్మకూరు శివారులో కలుసుకున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ గంజాయి నిర్మూలన కోసం పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది అక్రమంగా సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మీడియా సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.