
జనగామ రైతులకు న్యాయం చేయాలి, తడిసిన ధాన్యం కొనుగోలు, నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ డిమాండ్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, జనగామ డివిజన్లో అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ డిమాండ్ చేశారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ జనగామలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వరి ధాన్యం తడిసి, కొంత వరద నీటిలో కొట్టుకుపోయిందని తెలిపారు. ఆయన కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కుప్పలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యం సకాలంలో తూకం కాకపోవడం వల్ల అకాల వర్షానికి తడిసి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
అలాగే వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ నాయకుడు అర్కటి శ్రీనివాస్‌తో పాటు రైతులు ఊదరి కనకయ్య, జనగామ మల్లేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.