ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేస్తేనే అభివృద్ది సాధ్యపడుతుంది….
-ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని . అభివృద్ది , సంక్షేమం సమర్దవంతంగా అమలు చేయడంలో భాగంగానే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” మార్చి 6 నుండి జూన్ 12 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్నదని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ అన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామితో కలిసి, పచ్చ జెండా ఊపి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు , వార్డు అధికారులు, నగర పాలక సంస్థ సిబ్బందితో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వ సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేస్తేనే అభివృద్ది కార్యక్రమాలు సకాలంలో పూర్తికావడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని అన్నారు.
“ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” షెడ్యూల్ ప్రకారం మార్చి 6 నుండి 15 వరకు తొలుతగా నిర్వహిస్తున్న స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ ప్రణాళికాబద్దంగా చేపట్టాలని అన్నారు. నగరంలో సానిటేషన్ మెరుగు పర్చడంలో వార్డు అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు.
వార్డు అధికారులు మెరుగ్గా పని చేస్తే ప్రజా ప్రతినిధులపై భారం తగ్గడంతో పాటు ప్రజలకు మేలు చేయాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. మునిసిపాలిటీ సేవలు డివిజన్ లో సమర్దవంతంగా అందించడంలో వార్డు అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో సింగరేణి , ఎన్టిపిసి , ఆర్ ఎన్ సి ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు , స్వచ్చంద సంస్థలు , వలంటీర్లు , విద్యార్థినీ విధ్యార్థులను , ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసి ఈ నగరాన్ని పరిశుభ్రతలో అద్భుత నగరంగా తీర్చదిద్దాలని అన్నారు.. అభివృద్ది పనులకు నిధులు సమకూర్చడం తన భాద్యతని అన్నారు.
మహిళా సాధికారత పై కూడా దృష్టి సారించాలని అన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయించి ఆర్థికంగా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా సహకారం అందించాలని అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” రామగుండం నగరంలో సమర్ధంగా అమలు చేయడానికి రోజు వారీ షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం పరిసరాల పరిశుభ్రత తో పాటు పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ చేపట్టడం జరుగుతుందని అన్నారు.
సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రోడ్లు , కూడళ్ళు శుభ్రం చేయుట , మురుగు నీటి కాలువల్లో పూడిక తీత , స్వచ్చ వాహనాల మరమ్మత్తులు .కార్యాలయం శుభ్రత , గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ క్లియరెన్స్ , ప్రజలల్లో ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంపొందించడానికి 2 కె / 5 కె రన్ తదితర కార్యక్రమాలను చేపట్టడడం జరుగుతుందని అన్నారు.
ప్రతి కార్పొరేటర్ తమ డివిజన్ లో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” లో భాగంగా నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొనాలని కోరారు . వార్డు అధికారులు కార్పొరేటర్ లను సమన్వయం చేసుకుoటూ కార్యక్రమ పురోగతిపై ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
కార్పొరేటర్ల సమన్వయంతో వార్డు లో సమస్యలను గుర్తించి నివేదిక తయారు చేస్తే ఎం ఎల్ ఎ సహకారంతో నిధులు మంజూరు చేయించి సాధ్యమైనంత త్వరగా గుర్తించిన పనులు పూర్తి చేయిస్తామని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో మునిసిపాలిటీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని మనసా . వాచా , కర్మణా తన వంతుగా మునిసిపాలిటీ అభివృద్దికి కృషి చేస్తానని కార్పొరేటర్లు , అధికారులు , సిబ్బంది , మెప్మా ఆర్ పి లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య , కార్పొరేటర్లు , నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎస్ ఇ గురువీర , ఎ సి పి శ్రీహరి , టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా టి ఎం మౌనిక తదితరులు పాల్గొన్నారు.
