మహిళలు విద్య, ఆరోగ్యం, ఆర్థిక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
మహిళలు కుటుంబానికి వెన్నెముక వంటి వారని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండగలదు: జిల్లా ఎస్పీ సునీత రెడ్డి
వనపర్తి ఐడీఓసి సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ (మార్చి 8) వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఆ సమాజం నిజంగా అభివృద్ధి చెందినట్లు అని తెలిపారు. ఒక మహిళ బలంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం కూడా దృఢంగా తయారవుతుందన్నారు. కాబట్టి మహిళలకు ఆరోగ్యమనేది ఎంతో కీలకమైన అంశమని గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు పురుషులతో సమానంగా భోజనం చేయడంతో పాటు అన్ని అంశాల్లో సమానంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఒక మహిళ తన సొంత ఆరోగ్యం పై మొదటి ప్రాధాన్యత ఉంచాలని తెలియజేశారు. మన ఇళ్లలో మనం వ్యవహరించే విధానం పిల్లలపై ప్రభావం చూపుతుంది కాబట్టి మహిళలను గౌరవించడం ఇంటి నుంచి ప్రారంభం కావాలని గుర్తు చేశారు.
అదేవిధంగా సమాజంలో ఒక్క బాల్య వివాహం కూడా జరగడానికి వీల్లేదని, 18 ఏళ్లు నిండకుండా బాలికలకు వివాహం చేసేవారి సమాచారాన్ని ప్రభుత్వ అధికారులకు అందజేయాలని తద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాల్యంలోనే వివాహం చేయకుండా వారిని ఉన్నత చదువులు చదివించాలని, విద్యతోనే అందరికీ సమాజంలో గౌరవం పెరుగుతుందని తెలియజేశారు. చదువులో అమ్మాయిలు మధ్యలోనే డ్రాప్ అవుట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మహిళా దినోత్సవం మహిళల సాధికారత, సమాన హక్కులు మరియు సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తుచేసే ముఖ్యమైన రోజు అని అన్నారు. మహిళలు విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో మరింత ముందుకు రావాలని సూచించారు. మహిళలు స్వయం సమృద్ధిగా ఎదిగితే కుటుంబం, సమాజం మరియు దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో, బాలికల విద్యను ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. విద్యతోపాటు ఆర్థికంగా కూడా మహిళలు అభివృద్ధి సాధించాలని సూచించారు. మన జిల్లాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వనజ, రాములమ్మ అనే మహిళలను అందరు స్పూర్తిగా తీసుకోవాలని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయని వాటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ప్రారంభించిందని, దాన్ని ప్రతి ఒక్కరూ అమ్మాయిల కోసం వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా రాజకీయాల్లో సైతం మహిళల పాత్ర పెరగాలని సూచించారు. స్త్రీ పురుష సమానత్వం పై అమ్మాయిలకు చిన్నప్పటినుంచే తమ తల్లి తండ్రులు నేర్పించాలని, సమాజంలో ఇంకా ముందుకు వెళ్లేలా స్ఫూర్తి కల్పించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారని చెప్పడానికి గర్విస్తున్నాను అన్నారు. కేవలం మహిళా దినోత్సవం రోజు కాకుండా ప్రతిరోజు మహిళలకు గౌరవం దక్కేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం కూడా మహిళల భద్రత కోసం ఎంతగానో కృషి చేస్తుందని, పోలీస్ శాఖలో మహిళ ఉద్యోగుల పాత్ర పెరిగిందని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం ఎంతో, మహిళలు కుటుంబానికి వెన్నెముక వంటి వారిని వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళ ఉద్యోగులకు, మంచి ప్రతిభ కనబరిచిన మహిళలకు, విద్యార్థినిలకు కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, డి ఆర్ డి ఓ ఉమాదేవి, జి సి డి వో శుభలక్ష్మి, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్ ఎం ఓ రెడ్డి కుమారి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.
