అనకాపల్లి జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన
లంకెలపాలెం రోడ్డు ప్రమాదం నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహీన్ సిన్హా ఐపీఎస్ రోడ్ సేఫ్టీ పై సమీక్ష
పరవాడ (లంకెలపాలెం), జూన్ 27: లంకెలపాలెం కూడలిలో జూన్ 23 రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వారిలో మరికొంతమంది మృతిచెందడంతో, మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గంగవరం పోర్ట్ నుండి తెలంగాణలోని సిద్ధిపేటకు సెనగలు తరలిస్తున్న లారీ వేగంగా వెళ్లి, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.
ఈ సంఘటన నేపథ్యంలో రోడ్ సేఫ్టీ పరిరక్షణ చర్యలపై, రోడ్ ఇంజినీరింగ్ లో తగిన మార్పులు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ జి.మనోహర్, డీఎస్పీ శ్రీ వి.విష్ణు స్వరూప్ తో కలిసి ఘటన స్థలంలో సమీక్ష నిర్వహించారు.
ప్రమాద స్థలంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, వేగ నియంత్రణ, సిగ్నల్ వ్యవస్థ నిర్వహణ, ప్రమాదకరం గా ఉండే మలుపులు, డివైడర్లు, సైన్ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్షించి తగిన సూచనలు జారీ చేశారు. రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమీక్షలో రవాణా శాఖ అధికారి శ్రీ జి.మనోహర్, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ వి.విష్ణు స్వరూప్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు శ్రీ కె.ప్రవీణ్ కుమార్, శ్రీ పి.గోపీకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం,
అనకాపల్లి.
