ఉద్యోగుల సంక్షేమానికి వెనుకాడను

TEJA NEWS

ఉద్యోగుల సంక్షేమానికి వెనుకాడను

** ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీలో టీటీడీ చైర్మన్

తిరుమల: టీటీడీలో నిరంతరం భక్తుల సేవలో కొనసాగే ఉద్యోగుల సంక్షేమానికి తాను వెనుకాడనని టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీ.ఆర్.) నాయుడు పునరుద్ఘాటించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం ఆయన టీటీడీ ఉద్యోగులకు 2వేల హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, ప్రస్తుతం అమలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్ కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2 వేల హెల్మెట్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని ఆయన కోరారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు అందిస్తున్న హెల్మెట్లు ధరించి ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. హెల్మెట్లు ధరించడంపై అలిపిరితో పాటు , ఘాట్ రోడ్ల వద్ద ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సదా లక్ష్మీ, అన్న ప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి, పీఆర్వో విభాగం అధికారులు రవి, నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top