అప్పులబాధలో మాజీ సర్పంచులు
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ వద్ద అర్ధనగ్న నిరసన
సూర్యాపేట జిల్లా : గ్రామాభివృద్ధి పనులు పూర్తి చేసినప్పటికీ తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర అప్పులబాధలో కూరుకుపోయామని ఆరోపిస్తూ మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ సూర్యాపేట కలెక్టరేట్ వద్ద నిరసనలకు దిగారు. పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి తమను ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ వద్ద తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనుల బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల భారంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెండింగ్ నిధులను విడుదల చేసినప్పటికీ స్థానిక అధికారులు మాత్రం సర్పంచుల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
అధికారులు కావాలనే ఆలస్యం చేస్తూ సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ భయం ఉన్న నేపథ్యంలో అప్పులు తెచ్చుకొని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశామని మాజీ సర్పంచులు తెలిపారు. అయితే పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల కోసం అధికారులను సంప్రదిస్తే ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల ఆర్డర్ కాపీలు లేవన్న కారణంతో బిల్లులు ఆపడం అన్యాయమని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము తీవ్ర అప్పులబాధలో చిక్కుకుపోయామని వారు వాపోయారు. అప్పుల ఒత్తిడితో చాలా మంది మాజీ సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని మాజీ సర్పంచులు హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కోసం కృషి చేసిన తమను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేయడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
