పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి// .పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలకు పిలుపునిచ్చారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయం ప్రాంగణంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రధాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో ప్రజలకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై విశిష్ట ప్రచారం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రతి విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూఫ్ పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని, కార్బన్ ఉద్గారాలు జీరో స్థాయికి తేవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకం పై విస్తృత ప్రచారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 10 మంది లబ్ధిదారులు తమ ఇంటి రూఫ్ పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. మూడు కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం 78,000 సబ్సిడీ అందిస్తుందని, ప్రతి నెల దాదాపు 2000 రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేయవచ్చని తెలిపారు.
సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి పర్యావరణ హితమని మిగులు విద్యుత్ ను గ్రిడ్ కు ఇస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని సూచించారు. పీఎం సూర్య పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టి.జి. ఎన్.పి.డి.సి.ఎల్ ఎస్ఈ వి.గంగాధర్, డీ.ఈ రాజ బ్రహ్మయ్య చారి, రెడ్ కో జిల్లా మేనేజర్ డి. మనోహర్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
