
రూ. 82 కోట్లతో పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన
అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి….
— ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైన అడుగుగా రూ. 82 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 12.1 కిలోమీటర్ల నూతన బైపాస్ రోడ్డుకు ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గానికి రూ. 82 కోట్లతో బైపాస్ రోడ్డును మంజూరు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
పెద్దపల్లిలో బస్సు డిపో, జిల్లా కోర్టు భవనం, డబుల్ లైన్ రోడ్లు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మినీ ట్యాంక్ బండ్లు, బ్యాడ్మింటన్ కోర్టులు, నూతన వాటర్ ట్యాంకులు, సెంట్రల్ లైటింగ్, దేవాలయాల అభివృద్ధి వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. అలాగే అమృత్ పథకం ద్వారా ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
పెద్దకల్వల నుండి నిట్టూరు, చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు నిర్మించనున్న ఈ బైపాస్ రోడ్డు డబుల్ లైన్ రహదారితో పాటు సెంట్రల్ లైటింగ్ సదుపాయాలతో ఉండనున్నదని తెలిపారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ విప్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్థానిక సర్పంచులు, గ్రామ పాలకవర్గ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.