
కామ్రేడ్ భూపతన్నకు విప్లవ జోహార్లు
భూపతి రెడ్డి ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని నేతల ప్రతిజ్ఞ…..
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్, సిపిఐ (యం యల్) జనశక్తి కరీంనగర్ జిల్లా నాయకుడు కామ్రేడ్ భూపతి రెడ్డి (జీవన్)ను 1994 మే 8న హైదరాబాద్లో పట్టుకొని బదనపల్లిలో బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపి నేటికి 32 సంవత్సరాలు పూర్తయ్యాయి. సిరిసిల్ల రైతాంగ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కామ్రేడ్ భూపతి రెడ్డి ప్రజల కోసం పోరాడిన విప్లవ నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు. రాజ్యం వెంటాడినా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
కామ్రేడ్ భూపతి రెడ్డిని స్మరిస్తూ హైదరాబాద్లోని అరుణోదయ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణోదయ ఉభయ రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి మల్సూర్, రాష్ట్ర కార్యదర్శి రాకేష్, రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరు సదానందం, పీడీఎస్యూ (విజృంభణ) నాయకుడు పవన్, ఏఐఎఫ్టీయూ నాయకుడు ఏ. యాకన్న, రామన్న, అరుంధతి, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు కామ్రేడ్ భూపతి రెడ్డి ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన స్మృతిలో విప్లవ గీతాలు ఆలపిస్తూ ఘనంగా నివాళులర్పించారు.