యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందండి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

TEJA NEWS

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందండి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర- 2025…..5వేల మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం

ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేసిన…ఎమ్మెల్యే రాము,కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు అధికార ప్రముఖులు

గుడివాడ జూన్ 02:ప్రతి రోజు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని, యోగ ప్రాముఖ్యతపై నేటి యువతరం అవగాహన కలిగి ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో యోగాంధ్ర –2025 కార్యక్రమాలు మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. సందడి వాతావరణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఐదువేల మందికి పైగా ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తదితర అధికార ప్రముఖులు యోగాంధ్రలో పాల్గొని ఆసనాలు వేస్తూ… యోగా ప్రియులను ఉత్సాహపరిచారు.

కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేలా గుడివాడలో ఇంత పెద్ద ఎత్తున యోగాంధ్ర
కార్యక్రమం జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. వేడుకల్లో వేలాదిగా పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేశారు.

యోగ మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వజ్రాయుధమని, దీనిని మన జీవన శైలిలో భాగం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చన్నారు.యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎంతో విశిష్టత కలిగిన యోగాపై నేటి యువతరం అవగాహన కలిగి ఉండాలని సూచించారు.యోగాను ఒక నెల రోజులు పాటు క్రమం తప్పకుండా సాధన చేస్తే, తర్వాత నుంచి అది నిరంతర ప్రక్రియగా మారుతుందని, ఆ లక్ష్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెలరోజుల పాటు నిర్వహిస్తోందన్నారు.

జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి రాష్ట్ర ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పి, యోగాను వారి జీవనశైలిలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

అనంతరం కలెక్టర్ బాలాజీ ఇతర అధికార ప్రముఖులను ఎమ్మెల్యే రాము శాలువాలతో గౌరవ సత్కారం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించిన యోగా దిమ్ వీడియో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీ చంద్రశేఖర రావు, గుడివాడ ఆర్డిఓ బాలసుబ్రమణ్యం, గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, పెద్ద సంఖ్యలో యువత, వివిధ స్వచ్ఛంద సామాజిక సంస్థల సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top