గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
** ధ్వజారోహణంతో సకల దేవతలకు ఆహ్వానం
తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉదయం మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది. అంతకు ముందు శ్రీగోవిందరాజ స్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు:
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్ తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా 06న గరుడ వాహనం, 09న రథోత్సవం,10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు(ఎల్ఇడి)లు ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి , ఏఈవో కె.మునికృష్ణారెడ్డి , శ్రీవారి సేవకులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
