కుంభాభిషేక మహా క్రతువుకు ఘన ఏర్పాట్లు..
- ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా సౌకర్యాల కల్పన
- ఆధునిక సాంకేతికతతో భక్తుల భద్రతకు భరోసా
- అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదానికి అదనపు ఏర్పాట్లు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ద్వాదశ వర్ష నియమం ప్రకారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించే అత్యంత పవిత్రమైన కుంభాభిషేకం మహా క్రతువుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని.. గౌరవ ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు, ట్రస్టు బోర్డు, భక్తులు సమష్టి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఈవో వీకే శీనానాయక్ తదితరులతో కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యంగా విమాన గోపురం వద్ద చేసిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. తుది మెరుగులు దిద్దేందుకు ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఘాట్‌రోడ్డు, యాగశాల, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు తదితరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని.. గౌరవ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖులు వచ్చేందుకు అవకాశమున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, పార్కింగ్, సామాన్లు భద్రపరుచు కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు వంటి ఏర్పాట్లు చేస్తున్నామని.. వీటిని సద్వినియోగం చేసుకొని అమ్మవారిని దర్శించుకొని, భద్రంగా వెళ్లాలని సూచించారు. డ్రోన్లు, ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో జరిగే మూడు రోజుల మహా ఆధ్యాత్మిక క్రతువుకు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దామని ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అన్నారు. మంచినీరు, పాలు, మజ్జిగ, బిస్కట్లు వంటివాటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయన్నారు. కార్యక్రమానికి సంబంధించి గౌరవ సీఎంతో పాటు ప్రముఖులకు శుభ ఆహ్వానాలు అందించామని రాధాకృష్ణ తెలిపారు.
1,500 సిబ్బందితో పటిష్ట భద్రత: సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు
మూడు రోజుల పాటు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందన్న అంచనాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. దాదాపు 1,500 మంది సిబ్బందితో భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కూడా ఈ నెల 5వ తేదీ నుంచి పనిచేస్తుందని వివరించారు. ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం సహాయంతో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తామని రాజశేఖరబాబు తెలిపారు.
ఆలయ ఈవో వీకే శీనానాయక్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీనిబట్టి నిరంతర పర్యవేక్షణతో పటిష్ట ప్రణాళికతో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని.. మూడో రోజు మాత్రం అంతరాలయం దర్శనాన్ని పూర్తిగా నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్జిత సేవలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శీనా నాయక్ అన్నారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డీవో టీవీ సతీష్, డీసీపీ జి.రామకృష్ణ, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు ఎల్.రమ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
