జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలకు పతనం తప్పదు

TEJA NEWS

జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలకు పతనం తప్పదు

  • టిడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా నాలుగవ మహాసభలో మామిడి సోమయ్య హెచ్చరిక

సూర్యాపేట,; జర్నలిస్టులను గుర్తించకుండా వారి సమస్యలను విస్మరిస్తే ఏ ప్రభుత్వం అయినా పతన దశకు చేరుకోవడం ఖాయమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య హెచ్చరించారు. సూర్యాపేట పట్టణంలోని భాస్కర్ ఇన్ ప్యాలెస్‌లో నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా నాలుగవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాల్వాయి జానయ్య అధ్యక్షతన సాగిన ఈ మహాసభలో మామిడి సోమయ్య మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల జీవితం ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవం కోసం టిడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో–కన్వీనర్లు బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడి బాపురావు, జి. వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి పాల్గొన్నారు. బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిజం భారత రాజ్యాంగానికి నాలుగో స్తంభమని పేర్కొనగా, పులిపలుపుల ఆనందం జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం తప్పనిసరి కావాలని, 60 ఏళ్లు దాటిన జర్నలిస్టుల సంక్షేమానికి దేశవ్యాప్తంగా కొత్త సంఘం ఏర్పడిన విషయాన్ని వెల్లడించారు. నూతనంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పాల్వాయి జానయ్య మాట్లాడుతూ, గత 16 ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతున్న తాను జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘంగా టిడబ్ల్యూజేఎఫ్‌ను చూస్తున్నానని తెలిపారు. ప్రతి జర్నలిస్టు సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీకి ఎన్నికైన నాయకులకు ఇన్సూరెన్స్ పత్రాలను మామిడి సోమయ్య చేతుల మీదుగా అందజేశారు.


టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
టిడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా నూతన జిల్లా అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య, జిల్లా కార్యదర్శిగా ముశం హరిప్రసాద్, కోశాధికారిగా తాందారపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షుడిగా లింగాల సాయి గౌడ్, కార్యదర్శిగా నందిపాటి సైదులు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా వంగాల వెంకన్న, ఒగ్గు సోమన్న, గుడపూరి ప్రభాకర్ ఎంపికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా నజీర్ ఖాన్, కొంగల సతీష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శ్రీరాములు కృష్ణ, ఓరుగంటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బొల్లికొండ సతీష్, మీసాల నాగయ్య, పెంటగాని సతీష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హాజరైన జర్నలిస్టులందరూ నూతన కమిటీ సభ్యులను అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top