రాజకీయ పార్టీలతో ఓటరు నమోదు అధికారి మీటింగ్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా నమోదుకు అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలోని ప్రజల నుంచి వచ్చిన ఫారం 6, 7, 8 వంటి దరఖాస్తులను బి.ఎల్.ఓ.లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీల తరపున బూత్ లెవల్ ఏజెంట్లను ఇంకా నియమించలేదని, త్వరగా నియమించుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించామని, వాటి వివరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఏవైనా అభ్యంతరం ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ప్రతినిధులను కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన గడువు లోపు పార్టీల ప్రతినిధులు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
