తిరుపతి పీఆర్ఎస్ఐకి జాతీయ అవార్డు
** టీటీడీ అధికారి చేతుల మీదుగా ప్రదానం
తిరుపతి: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పిఆర్ఎస్ఐ) తిరుపతి చాప్టర్ కు జాతీయస్థాయిలో బెస్ట్ ప్రోగ్రామ్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును టీటీడీ చీఫ్ పిఆర్ఓ రవి చాప్టర్ ఛైర్మన్ డా.జిఎస్.ప్రసాద్, కార్యదర్శి దుద్యాల చంద్రమోహన్, ఇతర కార్యవర్గ సభ్యులకు ప్రదానం చేశారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇటీవల ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో పిఆర్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాథక్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పిఎల్ కే.మూర్తి, వైస్ ప్రెసిడెంట్ (సౌత్) యుఎస్.శర్మ కలిసి తిరుపతి చాప్టర్ కు బెస్ట్ చాప్టర్ అవార్డును ప్రకటించారు.
30 ఏళ్లుగా నిరంతర సేవలకు గుర్తింపు…
పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా పిఆర్ఓలకు వృత్తిపరమైన మెళకువలు నేర్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్ట్స్ తదితర కళాశాలల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ పెంపొందించేందుకు పలు సెమినార్లు చేపట్టారు. ప్రతి సంవత్సరం యూనియన్ బడ్జెట్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా టి.రవిని పిఆర్ఎస్ఐ తిరుపతి చాప్టర్ కార్యవర్గ సభ్యులు మెమెంటో, శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.శ్రీనివాసరావు, కోశాధికారి కె.మధుసూదన్, జాయింట్ సెక్రటరీ సంస్కార్ రాజేష్, కార్యవర్గ సభ్యులు డా. సి.స్వరాజ్యలక్ష్మి, వివి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
