
పలు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు పాక్షిక రద్దు
** కొన్నిటికి దారి మళ్లింపులు
** తిరుపతి స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ
…..
తిరుపతి: తిరుపతి రైల్వే యార్డ్ పరిధిలో డ్రైనేజీ ఆధునీకరణ పనులలో భాగంగా పాత పైపుల స్థానంలో బాక్స్ రకం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల నిమిత్తం ఈనెల 27(రేపటి) నుండి మే 2 వరకు 6 రోజుల పాటు, ప్రతి రోజు 6 గంటల బ్లాక్ అమలు చేయనున్నట్లు రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు.
ఈ కారణంగా తిరుపతి – కాట్పాడి, తిరుపతి – విల్లుపురం, తిరుపతి – కోయంబత్తూరు, తిరుపతి – రామేశ్వరం, తిరుపతి – చెన్నై, తిరుపతి – భువనేశ్వర్ మార్గాల్లో నడిచే పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడనున్నాయి.
అదేవిధంగా మన్నార్గుడి – తిరుపతి, కొల్లం – తిరుపతి, తిరుపతి – మన్నార్గుడి, తిరుపతి – కొల్లం వంటి రైళ్లకు కూడా తాత్కాలిక మార్పులు ఉంటాయి.
తిరుపతి – మైసూరు ఎక్స్‌ప్రెస్, తిరుపతి – కాచిగూడ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొంత సమయం ఆలస్యంగా నడపబడతాయి.
మరోవైపు హజ్రత్ నిజాముద్దీన్ – ఎర్నాకులం మంగల ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్ – తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయిల్ – షాలిమార్ ఎక్స్‌ప్రెస్, తిరునెల్వేలి – కత్రా హిమగిరి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు – హతియా ఎక్స్‌ప్రెస్ వంటి దూర ప్రయాణ రైళ్లు దారి మళ్లింపుతో నడపబడనున్నాయి.
ఈ మార్పుల కారణంగా కొన్ని రైళ్లు చిత్తూరు, చంద్రగిరి, తిరుపతి, తిరుచానూరు స్టేషన్లలో ఆగకుండా నడుస్తాయి.
ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా తమ ప్రయాణ సమయాలు, రైలు మార్గమార్పులు, రద్దు వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తుందని స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు.