రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన జగన్.

TEJA NEWS

రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన జగన్… వారికి మేలుచేశాననడం పచ్చి అబద్ధం :మాజీమంత్రి ప్రత్తిపాటి

  • అన్నదాతలకు పంటల బీమా సొమ్ము ఎగ్గొట్టడమేనా జగన్ వారికి అందించిన స్వర్ణయుగం : ప్రత్తిపాటి.
  • తాను బకాయిపెట్టిన ధాన్యం బకాయిలు కూటమిప్రభుత్వం చెల్లించిందనే వాస్తవాన్ని జగన్ విస్మరిస్తే ఎలా? : ప్రత్తిపాటి
  • గంగన్నపాలెంలో రైతులతో కలిసి ఏరువాకలో పాల్గొన్న ప్రత్తిపాటి.

తన పాలనలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన జగన్… నేడు రైతులకు మేలుచేశానని చెప్పడం సిగ్గుచేటని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పంటలబీమా సొమ్ము ఎగ్గొట్టిన వ్యక్తి, నేడు తన పాలన రైతులకు స్వర్ణయుగమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రత్తిపాటి ఎద్దేవాచేశారు. చిలకలూరిపేట మండలంలోని గంగన్నపాలెంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, రైతులతో కలిసి దుక్కిదున్ని ట్రాక్టర్ నడిపారు. అనంతరం గ్రామంలో రూ.8లక్షల వ్యయంతో కొత్తగా వేసిన సీసీరోడ్లు, డ్రైన్లను ప్రారంభించి, స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయప్రసంగాలు చేస్తూ, ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని ప్రత్తిపాటి తెలిపారు.పొలాల్లో ఆరబెట్టిన పొగాకు బేళ్లను జగన్ అనుచరులు పొడిపొడిగా తొక్కి నేలపాలు చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగించారని, ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో జగన్ చెప్పాలన్నారు. పోలవరం సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిన జగన్ తన పాలనలో రైతుల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడన్నారు. ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు కూడా పెట్టించకుండా, వరదకు అవి కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలుతీసిన వ్యక్తి, నేడు తాను అంతా మంచి చేశానని చెప్పుకోవడం పచ్చి బూటకం కాదా అని ప్రత్తిపాటి నిలదీశారు.

వంకాయలపాడులో సీసీరోడ్లు.. డ్రైనేజ్ ల ప్రారంభం

గంగన్నపాలెంలో ఏరువాక కార్యక్రమం అనంతరం ప్రత్తిపాటి యడ్లపాడు మండలం వంకాయలపాడులో రూ.16 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. గ్రామాభివృద్ధి విషయంలో గ్రామస్తులంతా ఒకేతాటిపై ఉండాలని, పార్టీలు.. కుల, మతాలనే అభిప్రాయాలను పక్కనపెట్టాలని ప్రత్తిపాటి వారికి సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, వీర రెడ్డి, చందు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, గట్టినేని రమేష్, శంకరరావు, పోపురి వెంకయ్య, గట్టినేని విజయ్ సాయి, ఎంపీడీవో లు, అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top