ఇంటి దొంగతనం కేసును చేదించిన పోలీసులు
** రూ.14 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం
** రేణిగుంట పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంస
తిరుపతి: రేణిగుంట పట్టణ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న పగటి పూట ఇంటి దొంగతనాలపై రేణిగుంట పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి, దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో, రేణిగుంట ఎస్‌డిపిఓ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.
ఆబృందం మంగళవారం ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని వేణుగోపాలపురం క్రాస్ వద్ద రేణిగుంట సీఐ ఎస్. జయచంద్ర నేతృత్వంలో, ఎస్.ఐ కె.ధర్మారెడ్డి, సిబ్బంది కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన నిందితుడు జి. ప్రభాకరన్ (వయస్సు: 32 సంవత్సరాలు), తండ్రి పేరు గణేష్, డోర్ నం.6, ఈ.ఏ.పి. శివాజీ స్ట్రీట్, ఒండికుప్పం, నవనీతం నగర్, వంగత్తూరు, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. నిందితుడి వద్ద నుండి సుమారు 97 గ్రాముల బంగారు ఆభరణాలు, 110 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి అంచనా విలువ సుమారు రూ.14లక్షలు ఉంటుంది.
దర్యాప్తులో భాగంగా నిందితుడిపై గతంలో తమిళనాడు రాష్ట్రంలోని మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంటి దొంగతనాలకు సంబంధించిన మూడు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. పోలీసులు వేగవంతంగా స్పందించి నిందితుడిని పట్టుకుని దొంగిలించిన ఆభరణాలను రికవరీ చేసినందుకు ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమ నివాస గృహాలు, వ్యాపార స్థలాలలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇంటిని ఖాళీగా ఉంచి బయటకు వెళ్లే సందర్భాలలో ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే వాహనాలను భద్రత కలిగిన ప్రదేశాలలో మాత్రమే పార్క్ చేయాలని, ఆస్తి భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు కోరారు.
ఈకేసు చేదనలో విశేష ప్రతిభ కనబరిచిన సి.ఐ ఎస్.జయచంద్ర, ఎస్.ఐ కె. ధర్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చలపతి, రాజశేఖర్, భారుషా, హేమంత్, డి.శ్రీను, జి.గౌరి నాయుడు, చల్లముత్తు లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్రసంశించారు. భవిష్యత్తులో ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.
