
ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు జోరు – లబ్ధిదారులకు చెక్కులు, సేవల వేగవంతం….
గంగాపురిలో రూ.7.30 కోట్ల గార్మెంటరీ యూనిట్ శంకుస్థాపన, – మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గంగాపురి (మంథని), తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మంథని ఆర్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు.
కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెల మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసి, ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరాలంటే అధికారులు కట్టుదిట్టంగా పని చేయాలని అన్నారు. గ్రామీణ ప్రజలకు నేరుగా లాభం చేకూరేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, మహిళల సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రత, పిల్లల పోషణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని వివరించారు.
అకాల వర్షాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తడిసిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఇదే సందర్భంలో గంగాపురి వద్ద రూ.7 కోట్లు 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్‌కు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ ద్వారా స్థానిక మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ గార్మెంటరీ యూనిట్ స్థాపనతో మంథని పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం కలుగుతుందని, ముఖ్యంగా మహిళా స్వయం ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.