ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలి….
ప్రజా ప్రతినిధులు పారదర్శకంగా బాధ్యతతో పని చేయాలి….
-మంత్రి లక్ష్మణ్ కుమార్….
పెద్దపల్లి// 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని మనమంతా విజయవంతం చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రంగాపూర్ లోని రాధాకృష్ణ ఏసీ కన్వెన్షన్ హాల్ లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పై స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, 99 రోజుల కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగుతుందని, సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మార్చి 6 నుంచి మార్చి 15 వరకు పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, పరిశుభ్రత గురించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
రాజకీయ జీవితాన్ని తాను స్థానిక సంస్థ నాయకునిగా ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు.
రాబోయే వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ త్రాగు నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. 99 రోజుల కార్యాచరణలో వివిధ శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాలలో భాగంగా సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ప్రజా ప్రతినిధులకు సూచించారు.
గత పాలకులు వైఫల్యం చెందిన కారణంగా అనేక ఆశలతో ప్రజలు మనకు అవకాశం ఇచ్చారని, గత రెండు సంవత్సరాల వ్యవధిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,
నూతన రేషన్ కార్డులు జారీ , సన్న బియ్యం సరఫరా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
రాబోయే బడ్జెట్లో పంచాయతీ, మున్సిపాలిటీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ రంగానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి ఎప్పుడు తీసుకుని వెళ్లిన వెంటనే స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు.
ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా బాధ్యతతో తమ విధులు నిర్వహించాలన్నారు. 2027 లో రానున్న గోదావరి పుష్కరాలకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు, దేవాలయాల అభివృద్ధికి నిధులు కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. సర్పంచ్, మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురించి అవసరమైన అవగాహన అందించేందుకు ఏర్పాటుచేసిన ఈ శిక్షణ కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్దిదారుల ఎంపిక, ప్రభుత్వ పని తీరు లో వచ్చిన మార్పుల గురించి తెలుసుకోవాలని అన్నారు.ప్రతి శాఖ సంబంధించి పని తీరు ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమంలో తెలుస్తుందని, ప్రజా ప్రతినిధులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ , రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిన గత 2 సంవత్సరాల కాలంలో గత పాలకులు ఖజానా ఖాళీ చేసినప్పటికీ ప్రభుత్వ సిబ్బందిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేస్తూ, అద్భుతమైన పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఎమ్మేల్యే తెలిపారు.
రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు గత పాలకులు అనేక వంకలు పెట్టి కోతలు విధించే వారని ఎమ్మెల్యే విమర్శించారు. రైతు పక్షపాతిగా ప్రస్తుత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భీమా, రైతు భరోసా , సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలు అమలు చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా వంటి పథకాల వల్ల పేదలు నెలకు వేల రూపాయలు ఆధా చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రజా ప్రతినిధులు చోరువ చూపాలన్నారు.
ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని, ఎక్కడా కక్షా పూరితంగా వ్యవహరించడం లేదని, అందరిని కలుపుకొని ముందుకు పోవాలని అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో ప్రజలకు అధికంగా పనికి వచ్చే పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని, రోడ్లు, డ్రైనీజీ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్య నిర్వహణ, చెట్ల పెంపకం పై కూడా స్థానిక ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లు, సర్పంచులు, సంబంధిత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
