రాజేంద్రప్రసాద్ మానవతా సేవలు వెలకట్టలేనివి: ప్రత్తిపాటి
- సీసీఎల్ వ్యవస్థాపకులు పట్టణంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి రూ.15 లక్షల విరాళమందించి తన ఉదారత చాటుకున్నారు
- మాజీమంత్రి ప్రత్తిపాటితో సమావేశమైన సీసీఎల్ సంస్థ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్రప్రసాద్
సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లా రాజేంద్రప్రసాద్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న మానవతాసేవలు వెలకట్టలేనివని, వారి సహకారంతో పేదల జీవితాలు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దిగ్గజ వ్యాపారవేత్త, సామాజిక సేవా తత్పరులు చల్లా రాజేంద్రప్రసాద్ .. తనను కలిసిన సందర్భంగా ప్రత్తిపాటి ఆయన్ని ఘనంగా సన్మానించారు. స్థానిక నివాసంలో ప్రత్తిపాటితో సమావేశమైన రాజేంద్రప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి.. ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యేతో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ.. పేట ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఏర్పాటు, నిర్వహణలో రాజేంద్రప్రసాద్ తనవంతు చేయూత అందించినట్టు చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి
సతీమణి శ్రీమతి భువనేశ్వరి చేతులమీదుగా గతంలో ప్రారంభమైన తాగునీటి పథకం కోసం రూ.15లక్షల విరాళం అందించడం ద్వారా రాజేంద్రప్రసాద్ తన సేవా తత్పరతను చాటుకున్నారని, ఆయన దాతృత్వంతో ప్రజలకు మేలు జరిగిందన్నారు. రాజేంద్రప్రసాద్ మాదిరే ఉన్నతస్థానాల్లోని ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాల్ని పేదల జీవితాల్లో వెలుగులు నింపే మహోన్నతులుగా మార్చాలనే సదాశయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పీ-4కు శ్రీకారం చుట్టారని ప్రత్తిపాటి చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ (సీఎస్ఆర్) లో భాగంగా సంపన్నులు తమ సంపాదనలో ఎంతోకొంత పేదల అభ్యున్నతికి వినియోగించి, సమాజ ప్రగతికి తోడ్పాటు అందించాలని ప్రత్తిపాటి విజ్ఞప్తి చేశారు.
