ప్రతి నెల 100కు పైగా మొబైల్ ఫోన్ల రికవరీ

TEJA NEWS

ప్రతి నెల 100కు పైగా మొబైల్ ఫోన్ల రికవరీ

సూర్యాపేట జిల్లా పోలీసుల విశేష కృషి

సూర్యాపేట జిల్లా :
జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడంలో సూర్యాపేట జిల్లా పోలీసులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 8వ దఫా సెల్ ఫోన్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 104 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ కె. నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ యజమానులకు (బాధితులకు) అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి దొరకడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ ఏడాది 8వ దఫా మొబైల్ మేళాను నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్‌ను బాధితులకు అందించామని తెలిపారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం మొత్తం 1334 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని వివరించారు. ఈరోజు రూ.20 లక్షల విలువైన 104 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. ఈ రికవరీ వెనుక జిల్లా పోలీస్ శాఖ చేసిన విశేష కృషి ఉందని, పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసే సైబర్ వారియర్స్, టెక్ టీం సిబ్బంది, రిసెప్షన్ సిబ్బంది నిరంతర శ్రమ ఫలితంగానే ఈ మొబైల్ ఫోన్లను బాధితులకు అందించగలిగామని తెలిపారు. కొన్ని మొబైల్ ఫోన్లను వివిధ రాష్ట్రాల నుంచి గుర్తించి తెప్పించామని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లలో బ్యాంక్ అకౌంట్స్, పాస్‌వర్డ్స్, సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తిగత ఫోటోలు వంటి విలువైన సమాచారం నిల్వ ఉంటుందని, మొబైల్ చోరికి గురైనా లేదా పోగొట్టుకున్నా కేవలం ఫోన్ మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారం, డబ్బులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు. మొబైల్ కేంద్రంగానే సైబర్ మోసాలు జరుగుతున్నాయని, దీంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు CEIR పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న వెంటనే సిఈఐఆర్ పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకొని మొబైల్‌ను బ్లాక్ చేయాలని, అనంతరం మీ సేవ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

పోలీసు సేవలను గుర్తించాలి

పోలీసులు ప్రజల భద్రత, ఆస్తుల రక్షణలో కుటుంబాలకు దూరంగా ఉండి అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తున్నారని, మీ రక్షణ కోసమే పోలీసులు ఉన్నారు అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ కృతనిశ్చయంతో సేవలు అందిస్తోందని తెలిపారు.

పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి దొరకవని భావించిన బాధితులు, జిల్లా పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించినందుకు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డీఎస్పీ రవి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top