
శంకర్‌పల్లిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా “రన్ ఫర్ నాలెడ్జ్”
జ్ఞానోద్యమానికి శక్తివంతమైన నాంది
- ఐదు కిలోమీటర్ల రన్‌తో అంబేద్కర్ ఆశయాలకు ఘన నివాళి
- డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో యువతలో చైతన్యం
- పాల్గొన్న వారికి టీ-షర్టులు, క్యాపులు, వాటర్ బాటిల్స్, పండ్ల పంపిణీ
- ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానo
- ప్రతి అడుగు ఉద్యమానికి బలం
- జ్ఞానం కోసం నిరంతర పోరాట సంకల్పం
శంకర్‌పల్లి :
భారతరత్న, సామాజిక న్యాయ శిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని శంకర్‌పల్లి మండలంలో మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ నాలెడ్జ్ – 5K రన్” కార్యక్రమం జ్ఞానోద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇది కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదు; అజ్ఞాన అంధకారాన్ని చెరిపివేసే చైతన్య దీప్తి, సమాజ మార్పుకు శక్తినిచ్చే ఆలోచనల ప్రవాహం, భావితరాల నిర్మాణానికి బలమైన పునాది.
సింగపూర్ టవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుంచి శంకర్‌పల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ఐదు కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ రన్‌లో యువత, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు అపార ఉత్సాహంతో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో నిలిపారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ మొదటి వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర పూలమాలలు సమర్పించి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించడం కార్యక్రమానికి శుభారంభం కలిగించింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడమే కాకుండా, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల భావజాలాన్ని ప్రతి ఇంటికి చేర్చడం ద్వారానే సమాజంలో స్థిరమైన మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీ-షర్టులు, క్యాపులు, వాటర్ బాటిల్స్, అరటి పండ్లు పంపిణీ చేయడం ద్వారా నిర్వాహకులు తమ సమన్వయ సామర్థ్యాన్ని చాటుకున్నారు. కార్యనిర్వాహక కమిటీ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఏర్పాట్లు నిర్వహించగా, ఈ విజయానికి కేంద్రమైన నిర్వాహకులు నల్లోళ్ల శ్రీకాంత్, బాలకిషన్‌లకు విశేష ప్రశంసలు లభించాయి.
“గడపగడపకు బాబాసాహెబ్ భావజాలం – గుండె గుండెకు అంబేద్కర్ ఆలోచనలు” అనే నినాదంతో నెల రోజుల పాటు సాగిన చైతన్య యాత్రలు ఈ మహోత్సవానికి పునాది వేశాయి. గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యపరచడం, యువతలో పెరుగుతున్న చెడు వ్యసనాలను నిర్మూలించడం, మత్తు బానిసత్వం నుండి విముక్తి కల్పించడం, ప్రతి కుటుంబంలో క్రమశిక్షణను పెంపొందించడం, అక్షరాస్యతను ఆయుధంగా మలచడం వంటి లక్ష్యాలతో ఈ ఉద్యమం ముందుకు సాగింది.
స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోవిధమ్మా గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, అంబేద్కర్ సంఘం నాయకులు, టీచర్ యూనియన్ నాయకులు రాములు సార్, వివిధ గ్రామాల యువత, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీస్ శాఖ, ట్రాఫిక్ సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు, లిటిల్ స్టార్ విద్యాసంస్థలు, సింగపూర్ ఆటో యూనియన్, మున్సిపాలిటీ సిబ్బంది అందించిన సహకారం కార్యక్రమానికి మరింత ఘనతను చేకూర్చింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రకటించిన సందేశం ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది — “మీ ప్రతి అడుగు ఉద్యమానికి బలం… పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శతకోటీ కృతజ్ఞతలు!” అంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా, నైతికంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ జ్ఞానోద్యమాభివందనాలు తెలియజేశారు.
మొదటి వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర మాట్లాడుతూ ఈ 5K రన్ ప్రధాన ఉద్దేశ్యం యువతను మత్తు బానిసత్వం నుండి దూరంగా తీసుకురావడం, సక్రమ మార్గంలో నడిపించడం, భావితరాలకు మార్గదర్శకులుగా తీర్చిదిద్దడం అని వివరించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ గత నెల రోజులుగా నిర్వాహకులు నల్లోళ్ల శ్రీకాంత్, బాలకిషన్ చేసిన కృషి ఫలితమే ఈ అఖండ విజయమని కొనియాడారు.
శంకర్‌పల్లి జనసంద్రోహంగా మారి వేలాదిగా తరలిన ప్రజలతో ఉత్సాహకర దృశ్యాన్ని సృష్టించింది. బాబాసాహెబ్ అడుగుల్లో అడుగులు వేస్తూ భావితరాలకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో ప్రజలు ముందుకు రావడం విశేషం. ప్రతి కొత్త తరానికి అంబేద్కర్ ఆలోచనలను అందించడం ద్వారా సమాజాన్ని సమానత్వ దిశగా నడిపించాలనే దృఢ సంకల్పం ఈ కార్యక్రమంలో స్పష్టమైంది.
అదేవిధంగా ఈనెల 30న నిర్వహించబడనున్న అంబేద్కర్ జాతర కార్యక్రమానికి సంబంధించి మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ బురాన్ ప్రభాకర్, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులు కూడా పాల్గొని కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత చేకూర్చారు