ఓటర్లను నిర్బంధించి గెలవాలనుకోవడం సిగ్గుచేటు
—- బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
స్థానిక మూడో వార్డులో రాజకీయ కుయుక్తులకు తెర
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా కలెక్టర్ చొరవ తీసుకోవాలి
మూడో వార్డులో జరుగుతున్న స్వేచ్ఛ విధ్వంసంపై ఫిర్యాదు చేస్తాం
స్వతంత్ర అభ్యర్థి దేవర్ల శివ గౌడును ఆశీర్వదించాలని వార్డు ప్రజలకు విన్నపం
వనపర్తి :
ఓటర్లను ఒకచోట కాంపౌండ్ లో నిర్బంధించి ఎన్నికల్లో గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యానికే చెరగని మచ్చ అని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మండిపడ్డారు.
జిల్లా కేంద్రంలోని స్థానిక మూడో వార్డులో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వనపర్తి పట్టణంలోని స్థానిక మూడో వార్డులో నాయకులు ఓటర్లను నిర్బంధించి రాజకీయ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటు అడగకుండా స్థానిక ప్రజలను ముకుమ్మడిగా ఒకచోట బంధించే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ పద్ధతి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు.
ఓటర్లను ఓటు అభ్యర్థించే హక్కు రాజ్యాంగం కల్పించినప్పటికీ మూడో వార్డులో మాత్రం రాజ్యాంగ విలువలకే తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.
ఓటమి భయంతోనే ఈ రకమైన అరాచకం చేస్తున్నారని, ఓటర్లు స్వతంత్రంగా ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్ తమ యంత్రాంగాన్ని పురమాయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నారని, నేడు మూడో వార్డులో మాత్రం రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విధంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఒకచోట నిర్బంధించడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు దేవర్ల శివ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా మూడో వార్డులో బరిలో నిలిచారని, దేవర్ల శివకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే బిసి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ, విద్య, వైద్యం, రేషన్ కార్డులు, పింఛన్, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేశామని అన్నారు.
నేడు రాజకీయ కుయుక్తులు చేస్తున్నవారికి వజ్రాయుధం లాంటి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రలను చేధించి దేవర్ల శివ గౌడ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ సాగర్, నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, యశ్వంత్, స్థానిక వార్డు మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
