గ్రామస్థాయికి సాంకేతిక వ్యవసాయం
** ఎన్.జి.రంగా వర్సిటీలో ఎంపీ గురుమూర్తి
తిరుపతి: స్థానిక చిత్తూరు రోడ్డులోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంను తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యా లయంలో జరుగుతున్న వివిధ వ్యవసాయ పరిశోధనలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, రైతులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలపై అధికారులు, శాస్త్రవేత్తలు ఎంపీకి సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్‌కు ఉపయోగపడే బయో పెస్టిసైడ్స్ అభివృద్ధి, వాటి తయారీ విధానం, పంటలపై వాటి ప్రభావం, ఖర్చు తగ్గింపు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి విశదీకరించారు.
రసాయన ఎరువులు, కీటకనాశక మందుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో ఈ బయో పెస్టిసైడ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సహజసిద్ధమైన సూక్ష్మజీవులు, వృక్షసారం ఆధారంగా తయారయ్యే ఈ ఉత్పత్తులు మట్టిసారాన్ని కాపాడుతూ, రైతులకు ఆరోగ్యకరమైన, నిలకడైన వ్యవసాయ పద్ధతిని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి కోసం పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేస్తున్న సాంకేతికతలను గ్రామస్థాయికి చేరవేయడం అత్యంత అవసరమని అన్నారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, బయో పెస్టిసైడ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయం సమన్వయంతో రైతులకు మద్దతు అందిస్తే ఆర్గానిక్ వ్యవసాయం విస్తృతంగా ప్రాచుర్యం పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
