నేరాల నియంత్రణలో రాజీ లేదు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి”

TEJA NEWS

“నేరాల నియంత్రణలో రాజీ లేదు.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి”

–సీపీ అంబర్ కిషోర్ ఝా….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, వారెంట్ల అమలు, పోలీసు సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడకుండా పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 2025 సంవత్సరానికి ముందు నమోదై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ, అరెస్టులు, సాక్ష్యాల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. ప్రాపర్టీ, బాడిలీ అఫెన్స్ కేసుల దర్యాప్తును చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. గ్రేవ్ కేసుల పురోగతిని డీసీపీలు, అదనపు డీసీపీలు ప్రతి వారం సమీక్షించాలని ఆదేశించారు.

ఆర్థిక నేరాల కేసుల్లో చట్టప్రకారం నిందితుల ఆస్తులను జప్తు చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. కిడ్నాపింగ్, మిస్సింగ్ కేసుల్లో బాధితులను గుర్తించడంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని, ఇలాంటి కేసుల్లో ఆలస్యం ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.

ఎన్‌డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను న్యాయస్థానం అనుమతితో త్వరితగతిన నిర్వీర్యం చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, కన్విక్షన్ శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా, గుడుంబా తయారీ, పేకాట తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, ప్రజల నుంచి నేరుగా అందే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించేది లేదని హెచ్చరించారు.

పోలీస్ సిబ్బంది విధిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించాలని, విధి నిర్వహణలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యాలయాలు, విధి నిర్వహణ ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top