జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్
** ప్రజల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత స్థాయిలో “విజిబుల్ పోలీసింగ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం, చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో, సెంటర్లలో, మార్కెట్ ప్రాంతాల్లో, వాహనదారులు, వ్యాపారస్తులతో పోలీసులు నేరుగా మమేకమై రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు.
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగించడం, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండడం వంటి అంశాలపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. అలాగే సైబర్ నేరాల పెరుగుదల దృష్ట్యా, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, ఓటీపీ మోసాలు, బ్యాంక్ వివరాల దుర్వినియోగం వంటి విషయాలపై ప్రజలకు జాగ్రత్తలు వివరించారు.
అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారం ఎవరితో పంచుకోవద్దని, ఏదైనా మోసం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై చట్టపరమైన కఠిన నిబంధనలను వివరించి, వాటి విక్రయం, రవాణా, వినియోగం చట్టరీత్యా శిక్షార్హమని తెలియజేశారు. యువత, వ్యాపారస్తులు ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి, నిషేధిత పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
