
టీటీడీలో అందరికీ బ్రహ్మోత్సవ బహుమానం
** ఏడీ బిల్డింగ్ వద్ద ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్
తిరుపతి: టీటీడీ పరిధిలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ కార్మికులకు, హెల్త్ కార్మికులతో పాటు స్విమ్స్, బర్డ్, ఆయుర్వేదిక్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ బ్రహ్మోత్సవ బహుమానం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. గతంలో ఆపేసిన లడ్డు, వడ మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో టిటిడి ఎడి బిల్డింగ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు పూర్తయి ఐదు నెలలు అవుతున్నా ఇంతవరకు తిరుమలలో, తిరుపతిలో అనేక విభాగంలలో పనిచేస్తున్న కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించకపోవడం సరైనది కాదని, వెంటనే టిటిడి యాజమాన్యం స్పందించి బ్రహ్మోత్సవ బహుమానం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే లడ్డు, వడ ఇచ్చేవారని, అయితే గత నాలుగు సంవత్సరాల నుండి ఉద్యోగులు, కార్మికులకు లడ్డు వడ ఇవ్వకుండా ఆపేశారని అన్నారు.
ఈ సమస్యపై రెండు సంవత్సరాల నుండి టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా… అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. గతంలో ఆపేసిన వారికి లడ్డు, వడ మంజూరు చేయాలన్నారు. డ్యూటీ సమయంలో ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు టిటిడి తోడ్పాటు ఇవ్వడం కోసం ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ అన్న ప్రసాద క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అన్నారు. దర్శన సౌకర్యంతో పాటు, లడ్డు కార్డు ఇవ్వాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని టిటిడి అధికారులకు సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేణుగోపాల్, కార్మికులు సిద్దు, ప్రభాకర్, దేసయ్య, రామకృష్ణ, రాజారెడ్డి, ఆనందు, రామచంద్ర, ఉమాపతి, సుజాత,రీత, శోభ, నాగరాణి, రాజేశ్వరి, సరిత, లక్ష్మి, అమ్ములమ్మ, తదితరులు పాల్గొన్నారు.