హిందువులకు జగన్ అండ్ కో.. క్షమాపణ చెప్పాలి

TEJA NEWS

హిందువులకు జగన్ అండ్ కో.. క్షమాపణ చెప్పాలి

** శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఉన్నట్లు సిట్ నివేదిక

** మీడియాతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులను మోసంచేసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వాడిన నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డీతో సహా ఆయన బ్యాచ్ కు చెందిన మాజీ టీటీడీ చైర్మన్లు హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని టీటీడీ చైర్మన్ అండ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు డిమాండ్ చేశారు. నెయ్యి టెండర్లలో టీటీడీ నిబంధనలు ఉల్లంఘన జరిగినా…వైసీపీ బ్యాచ్ తప్పుడు ప్రచారాలతో ఎదురు దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ నాయుడు శుక్రవారం సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ స‌మావేశంలో టీటీడీ బోర్డు స‌భ్యులు భాను ప్ర‌కాష్ రెడ్డి, ప‌న‌బాక ల‌క్ష్మీ, న‌రేష్‌ కుమార్‌, డాల‌ర్స్ దివాక‌ర్ రెడ్డి, ద‌ర్శ‌న్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ 60 ల‌క్ష‌ల కిలోల క‌ల్తీ నెయ్యి కొనుగోలు చేసిన గత టీటీడీ పాలకులు…క‌ల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను త‌యారు చేసి అప‌చారం చేశారని మండిపడ్డారు.


శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని, టిటిడి పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ చెప్పారు. నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్త‌వం కాద‌ని, సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టంగా నమోదయిందని ఆయన పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగాయని, కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలను మార్చారని తెలిపారు. సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని తెలిపారు. సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో 60 ల‌క్ష‌ల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని ప‌రీక్షించిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్.డీ.డీ.బీ) కూడా జంతు కొవ్వు ఉంద‌ని నివేదిక ఇచ్చిన‌ట్లు చెప్పారు.
ఒక్క ఆవు కూడా లేకుండా, చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధమని, నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని టీటీడీ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని పేర్కొన్నారు.

కమీషన్ల కోసమే కొన్ని డైరీలను ఎంపిక చేశారని అన్నారు. హైంద‌వ‌ స‌మాజాన్ని నాశ‌నం చేయ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. 2019-2024 సంవ‌త్స‌రాల‌లో హిందూ దేవుళ్ళ‌ను, హిందూ స‌మాజాన్ని హేళ‌న చేశార‌ని, వారంతా హిందూ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు. క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని సిట్‌ను కోరారు. బ్యాంక్ ఖాతాలలో కోట్ల రూపాయలు జమ కావడం వాస్తవమా కాదా, బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో నిగ్గుతేల్చాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, టిటిడి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి రాజీ ఉండదని ఛైర్మెన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top