ప్రజా సమస్యలే ఎజెండా
పారిశుధ్యంపై కౌన్సిలర్ల
చిలకలూరిపేట: పట్టణంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం, తాగునీటి ఎద్దడిపై చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా సభ్యులు గళమెత్తారు. మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో చైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చ సాగింది.
కుంటుపడిన పారిశుధ్యం.. ఒకే కార్మికురాలితో మూడు బజార్లా?
ఎజెండా పఠనం ముగియగానే 22వ వార్డు కౌన్సిలర్ కూనాల ప్రమీల పారిశుధ్య సమస్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన వార్డులో పారిశుధ్యం పూర్తిగా క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. “మూడు బజార్లకు కలిపి కేవలం ఒకే పారిశుధ్య కార్మికురాలు పని చేస్తోందని, ఇలాగైతే వీధులు ఎలా శుభ్రపడతాయి?” అని అధికారులను నిలదీశారు. తక్షణమే సిబ్బందిని పెంచి పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ షేక్ రఫాని, క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయని, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వేసవి ముందే తాగునీటి కష్టాలు.. రంజాన్ వేళ ఇబ్బందులు
10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని సభ దృష్టికి తెచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం వాడల్లో నీటి ఎద్దడి వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని, వేసవి ముందే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. పైపులైన్ల లీకేజీలు, ఇంటర్‌లింకింగ్ పనుల వల్లే సరఫరాలో అంతరాయం కలుగుతోందని డీఈఈ షేక్ అబ్దుల్ రహీం వివరణ ఇస్తూ, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ధన్యవాదాలు
మున్సిపాలిటీని సెలెక్షన్ గ్రేడ్ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు కౌన్సిలర్లు కొత్త కుమారి, బేరింగ్ మౌలాలి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రూ. 45 లక్షల నిధులతో అంగన్‌వాడీ, సచివాలయ భవన పనులు నిరంతరాయంగా సాగేలా సహకరించినందుకు వైసీపీ కౌన్సిలర్ కోట్యానాయక్ కూడా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు.
సంతాపం మరియు ఆమోదం
సమావేశం ప్రారంభంలో ఇటీవల మరణించిన మాజీ కౌన్సిల్ సభ్యురాలు మజీరున్నీసాకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం ఎజెండాలోని అన్ని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
