మరింత మెరుగ్గా క్రీడల్లో రాణించాలి
** మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులతో శాప్ ఛైర్మన్ రవినాయుడు
విజయవాడ(తిరుపతి):
ఏపీ తరపున క్రీడల్లో రాణిస్తున్న ప్రతీఒక్కరికీ శాప్ తరుపున పూర్తి సహకారం అందిస్తామని, దానికి అనుగుణంగా క్రీడల్లో మరింత మెరుగ్గా రాణించి అత్యధిక పతకాలు సాధించిపెట్టాలని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆకాంక్షించారు. మహారాష్ట్రలోని పూణేలో మే 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ జరిగిన 3వ కుడో (మార్షల్ ఆర్ట్స్) నేషనల్ ఛాంపియన్‌షిప్ కప్ 2025-26 పోటీల్లో ఏపీ తరపున ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వ్యక్తిగత విభాగంలో పాల్గొని 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు శాప్ ఛైర్మన్‌కు వివరిస్తూ మెడల్స్‌ను చూపించారు. ఈ సందర్భంగా వారిని శాప్ ఛైర్మన్ ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు.
బీహార్ వేదికగా మే 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ జరిగిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2025 పోటీల్లో సెపక్తక్రా టీమ్ విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ గెలిచినట్లు ఆంధ్రప్రదేశ్ సెపక్తక్రా క్రీడాకారులు శాప్ ఛైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారిని కూడా శాప్ ఛైర్మన్ అభినందిస్తూ శాప్ నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
